నా౽హం కర్తా

 *నా౽హం కర్తా:*


కాషాయరంగు పంచె, అదేరంగు చొక్కా, నుదుటిపై పెద్ద బొట్టు, మెడలో ఒక రుద్రాక్ష మాల, భుజానికి ఒక సంచీ..ఇటువంటి వేషధారణతో ఆ పెద్దమనిషి మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లోకి అడుగుపెట్టారు..నేరుగా బావి వద్దకు వెళ్లి, బకెట్ తో బావిలోంచి నీళ్లు తోడుకొని..కొన్ని నెట్టి మీద చల్లుకుని..మరికొన్ని తీర్ధం లాగా పుచ్చుకొని..మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..చక్కగా పద్మాసనం వేసుకొని కళ్ళుమూసుకున్నారు..పది పదిహేను నిముషాల తరువాత..మా సిబ్బంది కూర్చున్న చోటుకి వచ్చి..స్వామివారి చరిత్ర పుస్తకాన్ని కొనుక్కొని..మళ్లీ వెళ్లి మంటపం లో పద్మాసనం వేసుకొని కూర్చుని..శ్రద్ధగా ఆ పుస్తకాన్ని చదువుకోసాగారు..



సుమారు రెండు గంటల తరువాత..లేచి వచ్చి..మా సిబ్బందితో.."ఇక్కడ ప్రసాద్ అంటే ఎవరు?.." అని అడిగారు..నా వైపు చూపించారు మా సిబ్బంది..నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి నిలబడ్డారు..కుర్చీ చూపించి.."కూర్చోండి.." అన్నాను..కూర్చున్నారు.."చెప్పండి..మీరెవరు?..ఏ ఊరు నుంచి వచ్చారు..?ఏ పని మీద నన్ను కలవాలనుకున్నారు?" అన్నాను..


"అయ్యా..నా పేరు భాస్కర శర్మ..ప్రస్తుతం వారణాసి లో ఉంటున్నాను..ఈ క్షేత్రం గురించి విన్నాను..మీ తల్లిగారు వ్రాసిన స్వామివారి జీవిత చరిత్రను చదివాను..ఆ పుస్తకం తీసుకురావడం మర్చిపోయాను..అందుకే మళ్లీ ఇక్కడ కొనుక్కున్నాను..ఇప్పుడు కూడా మళ్లీ ఒకసారి ఆ పుస్తకాన్ని పారాయణం చేసాను..ఒక అవధూత కు ఎంతో సేవ చేసుకున్న పుణ్యదంపతుల కడుపున పుట్టారు మీరు..ఆ దంపతులు జీవించి ఉండగా వారిని చూసే భాగ్యం నాకు కలుగలేదు..ఈ స్వామివారు సిద్ధిపొందేనాటికి నా వయసు మూడేళ్లు..కాబట్టి వారిని చూసే యోగమూ లేకుండా పోయింది..కనీసం స్వామివారి సేవలో తరించిన వారి వారసత్వంగా ఉన్న మిమ్మల్ని చూద్దామని అనుకున్నాను.." అన్నారు..నేను మౌనంగా వున్నాను.."నాకు కొన్ని సందేహాలున్నాయి..మిమ్మల్ని అడగవచ్చా?.."అన్నారు..నిరభ్యంతరంగా అడగండి అన్నాను..


"మీ నాన్నగారు మొట్టమొదటిసారిగా స్వామివారిని కలిసినప్పుడు..స్వామివారి వయసు ఎంత?" అన్నారు.."ఇరవై ఆరేళ్ళు.." అన్నాను.."అప్పుడు స్వామివారు దిగంబరంగా ఉన్నారా?.." అన్నారు.."అవును..అదే మా నాన్నగారు చెప్పారు.." అన్నాను.."అలాగా.." అని ఒక్కక్షణం ఆగి.."అలా దిగంబరంగా ఉన్న యువకుడిని చూస్తే..మీ నాన్నగారికి ఎటువంటి ఏహ్య భావమూ కలుగలేదా.." అన్నారు.."లేదు..పైగా మా నాన్నగారు ఆ క్షణం లో ఆయన్ను చూస్తూ ఉండిపోయారే గానీ..మరే ఇతర ఆలోచనలూ కలుగలేదు.." అన్నాను.."మీరు కూడా ఈ స్వామివారిని చూసారా.." అన్నారు.."చూసాను..మాట్లాడాను..మొదటిసారి స్వామివారిని కలిసినప్పుడు నా వయసు పన్నెండేళ్ళు..స్వామివారు సిద్ధిపొందేనాటికి నాకు పదహారేళ్ల వయసు..ఈ నాలుగేళ్ళ కాలంలో ఎన్నో సార్లు స్వామివారితో చాలా సన్నిహితంగా వున్నాను..స్వామివారు కపాలమోక్షం చెందే సమయం లో కూడా నేను వున్నాను.." అని పాఠం చెప్పినట్టు చెప్పాను..అంతా శ్రద్ధగా విని చిన్న చిరునవ్వు నవ్వారు..


"ఆ నాలుగేళ్ళ సాన్నిహిత్యపు ఫలితమే..ఈనాడు ఈ మందిర నిర్వహణ చేసే అవకాశం మీకు కలిగింది..ఎందరో భక్తులను దగ్గరగా చూడగలుగుతున్నారు..మీకు తెలీకుండానే..మీరు ఒక పవిత్ర కార్యం లో పాలుపంచుకుంటున్నారు..కానీ..ఒక్కమాట చెప్పక తప్పదు..ఇందాక మీరు స్వామివారితో నాలుగేళ్ళ సాన్నిహిత్యం ఉంది అని చెప్పేటప్పుడు..మీలో ఒకవిధమైన అహం కనబడింది నాకు..అది మంచిది కాదు..మీ తల్లిదండ్రులు ఎంత వినయంగా సేవ చేసుకున్నారో మీరు దగ్గరుండి చూసారు..ఈ పుస్తకం మీ అమ్మగారు వ్రాసారు..ఎక్కడా తన అహంభావాన్ని బైట పెట్టుకోలేదు..పైగా తన ఆహాన్ని స్వామివారు ఎలా నియంత్రించిందీ ఏమాత్రం భేషజం లేకుండా వ్రాసారు..అటువంటి విధేయత స్వామివారు కోరుకున్నారు..బహుశా నేను చెప్పేది మీకు అర్ధమయ్యే ఉంటుంది.." అన్నారు..నేను మౌనంగా విన్నాను..ఏమీ మాట్లాడలేకపోయాను..


"ఒకసారి స్వామివారి సమాధి దర్శనం చేసుకుని వస్తాను.." అన్నారు..సరే అని తలవూపాను..సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చారు.."నేను మూడురోజుల పాటు ఇక్కడ ఉండాలని అనుకున్నాను..ప్రత్యేక వసతి ఏమీ వద్దు..ఈ మంటపం లోనే ఉంటాను..నా ధ్యానం నేను చేసుకుంటాను.." అన్నారు.."అలాగే వుండండి..ఇబ్బందేమీ లేదు.." అన్నాను..మూడు రోజులూ వున్నారు..నేను మాత్రం వారు చెప్పిన మాటలను మననం చేసుకుంటూ వున్నాను..మూడోరోజు సాయంత్రం నా వద్దకు వచ్చి.."మందిరాన్ని బాగా వృద్ధి లోకి తీసుకుని రండి..మీ వంతు కృషి మీరు చేయండి..మీకు స్వామివారి అండదండలు ఉంటాయి..స్వామివారు చెప్పినట్టు ఇది ఒక దత్తక్షేత్రం గా మారుతుంది.." అన్నారు.."నా శాయశక్తులా కృషి చేస్తాను.." అన్నాను..నా భుజం తట్టి.."ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోండి.."నా౽హం కర్తా:" అనుకోండి..మిగిలింది స్వామివారే చూసుకుంటారు.." అన్నారు..తలవూపాను..మరోసారి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిపోయారు..


భాస్కరశర్మ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయాయి..నిజమే..స్వామివారి వద్ద ఏ పని జరిగినా..నేను కర్తను కాను..అంతా ఆ స్వామివారే..


సర్వం..

శ్రీ దత్తకృప!

Comments