దుర్భోద

 🌹దుర్భోద !🌹


        దశరథుడి ఆదేశం మేరకు అక్కడికి వసిష్ఠుడు వచ్చాడు. సీతారాములను ఉపవాస దీక్షలో ఉంచి వెళ్ళిపోయాడు. మర్నాడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం. ఆ ఉత్సాహంతో పౌరులంతా నగరాన్ని అలంకరించేందుకు పూనుకున్నారు. 



         రాచబాటల్లో నీరు చల్లారు. ముగ్గులు పెట్టారు. రంగురంగుల పతాకాలెగరేశారు. దారి పొడుగునా అరటి స్తంభాలు నాటి, తోరణాలు కట్టారు. ఇళ్ళను కూడా అలంకరించుకున్నారు. అభరణాలూ, మంచి వస్త్రాలూ ధరించారు. స్త్రీ బాల వృద్ధులతో పురుషులంతా వీధుల్లో తిరుగుతూ పాటలు పాడసాగారు. 


        సూర్యోదయం కోసం ఎదురుచూడసాగారు. ఎప్పుడు తెల్లారుతుందా? రాముడి పట్టాభిషేకం ఎప్పు డెప్పుడా అని ఉవ్విళ్ళూరసాగారు. వారందరినీ నవ్వుతూ చూస్తూ దశరథుణ్ణి సమీపించాడు వసిష్ఠుడు. సీతారాములను దీక్షలో ఉంచి వచ్చానని చెప్పాడు. మిగిలిన కార్యాల్లో తలమునక లయ్యేందుకు అక్కణ్ణుంచి బయల్దేరాడు. 


        రామమందిరం శోభాయమానంగా ప్రకాశించసాగింది. రాకుమారుని హితులూ, సన్నిహితులూ, పరిచారికులూ అటూ ఇటూ తిరుగుతూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉన్నారు. రాముడు స్నానం చేశాడు. నారాయణుణ్ణి పూజించాడు. అగ్నిలో నేతిని వేల్చాడు. మిగిలిన దానిని భార్యాభర్తలిద్దరూ పంచుకుని తాగారు. 


        తర్వాత అక్కడే నారాయణుడి సన్నిధిలోనే దర్భలపై నియమంగా పడుకున్నారు. తెల్లారడానికి జాము ముందు వందిమాగధుల స్తోత్రపాఠాలతో మేలుకున్నారిద్దరూ. సంధ్య వార్చాడు రాముడు. తెల్లని వస్త్రాలు ధరించి, సీతారాములు నారాయణుడి ముందు చేతులు జోడించి, నమస్కరిస్తూ శిరసు వంచి నిలుచున్నాడు. 


        వారిని బ్రాహ్మణులు ఉచ్చెస్వరంతో ఆశీర్వదించారు. ఇంతలో పెద్ద ధ్వనులతో భేరులు మోగాయి. ఆ భేరుల ధ్వనితో రాముడు ఉపవాసదీక్ష ముగించాడని తెలుసుకున్నారు పౌరులు. ఉత్సాహంతో దీపాలు వెలిగించారు. ఒకరిపై ఒకరు పువ్వులు జల్లుకున్నారు. 


        ఎక్కడపడితే అక్కడ నృత్య నాటకాలు ప్రారంభ మయ్యాయి. పిల్లలంతా పెద్దల సంతోషానికి అనుగుణంగా ఆటలాడుకోసాగారు. ఆ కోలాహలానికి సౌధం వెలుపలికి వచ్చి నిలబడింది మంధర. కిందకి చూసింది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న పౌరులను చూసి కళ్ళు చిట్లించింది.


        వందిమాగధుల స్తోత్రపాఠాలతో సీతారాములు మేల్కొన్నారు. నారాయణుణ్ణి ధ్యానించారిద్దరూ. తర్వాత బ్రాహ్మణుల ఆశీర్వాదాలు అందుకున్నారు. అంతలో పెద్దపెద్ద ధ్వనులతో భేరీలు మోగాయి. అది విని సీతారాముల ఉపవాస దీక్ష ముగిసిందనుకున్నారు పౌరులు. ఉత్సాహంతో దీపాలు వెలిగించి, ఒకరిపై ఒకరు పువ్వులు చల్లుకున్నారు. 


        నృత్యాలు చేశారు. అంతటా కోలాహలం చెలరేగింది. నవ్వులూ, కేకలూ వినవస్తున్నాయి. ఆ శబ్దాలకు చెవులు చిల్లులు పడ్డట్టనిపించిందేమో! చెవులుమూసుకుంది మంధర. అసలు ఎందుకు ఈ గోల? ఏమైంది? అది తెలుసుకునేందుకు కైకేయి ప్రాసాదం మీదికి పట్టి పట్టి అడుగులు వేస్తూ చేరుకుంది. 


        మంధర ఎక్కడ పుట్టిందో ఆమె తల్లిదండ్రులెవరో తెలియదు. బంధుదాసిగా కైకను ఆశ్రయించిందామె. పొట్టకూటికోసం చేతులు జోడించి, కన్నీరు పెట్టుకుంటే కైక ఆమెను చేరదీసింది. మరుగుజ్జు. వయసులో పెద్దది. పరుగెత్తి పెద్ద పెద్ద పనులు చేయలేదు. సరిగా నిలబడలేదు కూడా. అయినా జాలిపడి, మంధరను పరిచారికను చేసుకుంది కైక. 


        కైకకు బాగా సన్నిహితురాలై పరిచారిక స్థాయిని దాటి కైకను మందలించగలిగే స్థాయికి చేరుకోగలిగింది మంధర.

గోలగోల చేస్తున్నారు పౌరులు. తానొకతె ఉన్నదనే సంగతే తెలుసుకోవడం లేదు. తనని పట్టించుకోవట్లేదు. ఎందుకు? ఏమిటి? అనుకుంటూ ప్రాసాదం మీదికి చేరుకుని, చుట్టూ కలయజూసింది మంధర. 


        వీధుల్లో తోరణాలు కట్టి ఉన్నాయి. ముగ్గులు వేసి ఉన్నాయి. పువ్వులు జల్లుకుంటున్నారంతా. రకరకాల వాద్యాలు మోగిస్తూ నృత్యాలు చేస్తున్నారు. వేదఘోషలు వినవస్తున్నాయి. అలంకరించబడిన గుర్రాలూ, ఒంటెలూ, ఏనుగులూ బారులు తీరి ఉన్నాయి. అంతుచిక్కలేదు మంధరకు. ఆశ్చర్యపోతూ అటుగా చూసింది. 


        కౌసల్య మందిరం మీద నిల్చుని, పూలతోరణాలు కడుతున్నారు పరిచారికలు. వాళ్ళలో ఒకదాన్ని కేకేసి పిలిచి ‘ఏమిటీ కోలాహలం? ఎందుకిదంతా?’ అని అడిగింది మంధర.


        “ఎందుకంటే ఈ రోజు మా రాములవారికి యువరాజ్య పట్టాభిషేకం. అందుకు” అంది ఆ పరిచారిక. 


        ఆ అనడంలో దర్పాన్ని వ్యక్తం చేసిందామె. ఆ దర్పాన్ని తట్టులేకపోయింది మంధర. మండిపోయింది. కళ్ళెర్ర జేసుకుంది. మెట్ల మీది నుంచి గుమ్మడికాయ దొర్లినట్టుగా దొర్లుకుంటూ కిందకి దిగింది. పరుగులాంటి నడకతో కైక గది దగ్గరకు చేరుకుంది. మూసి ఉన్న ఆ గది తలుపుల్ని విసు రుగా ముందుకు తోసింది. 


        ఆ విసురుకి వెనక్కి వెళ్ళి గోడను బలంగా డీకొన్నాయి తలుపులు. గోడను డీ కొనడంతో తలుపులకు ఉన్న చిరుగంటలు పెద్దగా శబ్దించాయి. లోనికి ప్రవేశించింది మంధర. తల్పం మీద ఆదమరచి నిద్రపోతున్న కైకను సమీపించింది. ‘కైకా’ గట్టిగా అరిచింది. 


        మంధర అరుపునకు మేల్కొంది కైక. కళ్ళిప్పి చూసింది.


        “ఎందుకే? ఏమిటా కేకలు?” అంటూ ఒళ్ళు విరుచు కుంటూ లేచి కూర్చుంది కైక.


        “ఎందుకంటే ఏం చెప్పనే తల్లీ! మహారాజు నీ బతుక్కి నిప్పు పెట్టేశాడు. నిన్ను దూరం చేశాడు. నువ్వు గీసిన గీత మహారాజు దాటడనుకున్నావు. కాని, దాటేశాడే తల్లీ. కొంపముంచేశాడు.’’ అంది మంధర ఏడుపు అందుకుంటూ.


        అర్థం కాలేదు కైకకు. మహారాజు మీదే మాటల్ని ఎక్కుపెడుతోంది మంధర. ఏమైంది దీనికి అనుకుందామె.


        “ఏమైందే నీకు? మహారాజును ఎందుకు అంతంత మాటలంటున్నావు?” అడిగింది కైక.


        “అనక, నెత్తిన పెట్టుకోమంటావా? అయి పోయిందే తల్లీ, అంతా అయిపోయింది. నీకు చెడుకాలం దాపురించింది. నువ్విక ఎంతోకాలం ఈ అంతఃపురంలో ఉండలేవు” అంది మంధర. 


        రాగం పెట్టి పెద్దగా ఏడవసాగింది.


        “ఏడుపాపి, విషయం చెప్పవే” లేచి నిల్చుంది కైక.


        “ఏం చెప్పమంటావు? తెల్లారితే రాముడికి యువరాజ్య పట్టాభిషేకమంట! నీ కొడుకుని కాదని, మహారాజు, నీ సవతి కొడుక్కి రాజ్యాన్ని కట్టబెడుతున్నాడు. ఇప్పుడే ఈ వార్త నాకు తెలిసింది. నీకు చెబుదామని పరిగెత్తుకు వచ్చాను” అంది మంధర. 


        రాముడికి పట్టాభిషేకం! ఆశ్చర్యానందాలకులోనైంది కైక. సన్నగా నవ్వుతూ మంధరను చూసిందామె


“ఎంత తెలివైనదానివి, ఎంత అందగత్తెవు. అయినా మోసపోయావు. కొంగున కట్టేసుకుందే తల్లీ, మహారాజును కౌసల్య కొంగున కట్టేసుకుంది. కట్టేసుకుని, రాముణ్ణి రాజును చేసుకుంటోంది. నువ్వూ ఉన్నావు, నిద్రపోతున్నావు. నీ నవ్వులు కావాలి. నీతో సరసాలు కావాలి. కాని, నీ కొడుకు రాజు కాకూడదు. 


        కాకూడదనే వాణ్ణి తాతగారింటికి పంపాడు మహారాజు. పెద్ద కుట్ర చేశాడు. రాముడు రాజయితే నీకూ, నీ కొడుక్కీ దిక్కెవరే తల్లీ? రాముడు రాజు కాకూడదు. ఈ పట్టాభిషేకం జరగకూడదు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో అది ఆలోచించుకో”  అంది మంధర. 


        ఇక తనవల్ల కాలేదు. పగలబడి నవ్వింది కైక. పడి పడి నవ్వింది. నవ్వుతూ మంధరను పట్టుకుని తిరిగింది. ఒప్పుకుప్పలాడింది.


        “అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతానే”  అని మంధర గగ్గోలు చేస్తోంటే, ఆగి అన్నదిలా కైక.


        “పిచ్చిదానా! ఎందుకే లేనిపోని భయాలూ, అసూయలూ కల్పిస్తావు? రాముడు మాత్రం నా కొడుకు కాదా? భరతుడూ, రాముడూ నాకు వేరువేరు అనుకున్నావా? ఎంత మాత్రం కాదు. నాకిద్దరూ ఒకటే! రాముడికి పట్టాభిషేకం అంటే భరతుడికి జరుగుతున్నట్టే” అంది.


        అవాక్కయింది మంధర.


        “నా రాముడికి పట్టాభిషేకం. ఎంత మంచిమాట చెప్పావే! మహారాజు కన్నా ముందుగా నాకీ మాట చెప్పి, నన్నెంతో సంతోషపెట్టావు. అందుకు నీకిదే నా కానుక”  అంటూ కైక మెడలోని హారాన్ని తీసి, మంధరకి అందజేసింది.


        “కోరుకో! ఇంకేం కావాలో కోరుకో, ఇస్తాను” అంది.


        చేతిలోని హారాన్నీ, కైకనూ పదేపదే చూసింది మంధర. రగిలిపోయింది. చేతిలోని హారాన్ని బలంగా నేలకేసి విసిరికొట్టింది. పగిలిన హారంలోని వజ్రాలు చెల్లాచెదురు అయ్యాయి.


        “మంధరా !” కోపంగా అరిచింది కైక.


        “నువ్వు ఎంతగా అరిచినా నేను భయపడను. నీ మూర్ఖత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ముంచుకొస్తున్న ఆపదను చూసి మురిసిపోతున్న ఆడదాన్ని నిన్నే చూశాను. రామాభిషేకం నీకు ఆనందంగా ఉందా? బుర్రా బుద్ధీ ఉండే మాట్లాడుతున్నావా? బాగా ఆలోచించవే! రాజ్యార్హత భరతుడికే ఉంది. 


         ఆ అర్హత కలిగిన భరతుణ్ణి చూసి, పట్టాభిషిక్తుడైన రాముడు ఊరుకుంటా డనుకున్నావా? ఊరుకోడుగాక ఊరుకోడు. ఎప్పటికైనా భరతుడు ప్రమాదకారి అని వాణ్ణి అంత మొందిస్తాడు. నీ కొడుకుని నిలువునా కోస్తాడు. లేదంటే తెలివిగా వాణ్ణి వనవాసానికి పంపిస్తాడు” అన్నది మంధర.


        కళ్ళు చిట్లించింది కైక.


        “కల్లాకపటం ఎరుగడు. పాపం పుణ్యం తెలీదు. భరతుణ్ణి తలచుకుంటేనే బాధగా ఉంది. నేను తట్టుకోలేనే” అంటూ ఏడవసాగింది మంధర. 


        ఓదార్చేందుకన్నట్టుగా ఆమెను దగ్గరగా తీసుకోబోయింది కైక. దూరంగా జరిగింది మంధర. ఇలా అన్నది.


        “రేపటి నుంచి చూడు, నీ సవతి వైభోగం. ఆ ముసలి కౌసల్యకు మహర్దశ పట్టింది. అది రాజ మాత. నువ్వు మామూలు రాణివి. మాతో పాటు నువ్వు కూడా రేపటి నుంచి కౌసల్యకు చేతులు జోడించి నమస్కరించాలి. చెప్పిన పని చెయ్యాలి. నీతో పాటు నీ కొడుకు కూడా ఊడిగం చెయ్యక తప్పదు. రాజు కావాల్సిన వాణ్ణి కావాలనే బానిసను చేస్తున్నావు కదే! నువ్వు తల్లివేనా?”


        కళ్ళు మూసుకుని వెంటనే తెరిచింది కైక.


        “దశరథుడి ముద్దుల భార్య ఈ కైక మంది రాన్ని రేపట్నుంచీ ఎవరూ పట్టించుకోరు. దీనిని ఓ మూలన పడేస్తారు. ఇవాళ ఉన్న శాంతి సౌఖ్యాలు రేపు ఉండవే తల్లీ. చెబుతున్నాను వినవే! నీ కోసమే నా ఆవేదన.


        ముద్దులరాణివై ఉండి, కౌసల్యను నానా ఇబ్బందులూ పెట్టావు. తను మరచిపోతుందనుకున్నావా? మరచిపోదు. ఇప్పుడు రాజమాత అవుతోందిగా, నిన్ను కుక్కను చూసినట్టుగా చూస్తుంది. నీ దౌర్భాగ్యాన్ని తలచుకుంటుంటే చాలా బాధగా ఉందే.’’ అంది మంధర. ఆలోచనలో పడ్డది కైక.


                                  🌺🌼🌺

Comments